కోటి రూపాయల గ్రంథాలయం.. నిర్వహణకు ఒక్కరే సిబ్బంది
కీసర, మేజర్ న్యూస్:కీసరలో కోటి రూపాయల జెడ్పీ నిధులతో మూడు అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన నూతన గ్రంథాలయం అందుబాటులోకి వచ్చినప్పటికీ, దాని నిర్వహణకు కేవలం ఒక్క ఉద్యోగి మాత్రమే ఉండటం చర్చనీయాంశంగా మారింది. విశాలమైన భవనం, అన్ని రకాల పుస్తకాలు, ఆధునిక వసతులు కల్పించిన అధికారులు, గ్రంథాలయ నిర్వహణకు అవసరమైన పూర్తిస్థాయి సిబ్బందిని ఎందుకు నియమించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.కీసరలోని పాత గ్రంథాలయం పాఠకులకు సరిపోకపోవడంతో మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో బోగారం రోడ్డులోని రామలింగేశ్వర కాలనీలో 2023 జూలైలో అప్పటి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జెడ్పీ నిధులు కోటి రూపాయలతో మూడు అంతస్తుల్లో విశాలమైన భవనాన్ని గ్రంథాలయ శాఖ ఆధునిక హంగులతో నిర్మించింది. ఇందులో వివిధ రంగాలకు చెందిన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. బుధవారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.అయితే ఇంతటి భారీ భవనాన్ని నిర్వహించేందుకు ఒక్క ఉద్యోగి మాత్రమే ఉండటంతో పలు సమస్యలు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. గ్రంథాలయంలో పుస్తకాలను పాఠకులకు అందించడం, దినపత్రికలను అందుబాటులో ఉంచడం, పుస్తకాల నిర్వహణ, భవనం పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణతో పాటు పాఠకుల అవసరాలను పర్యవేక్షించడం వంటి అనేక బాధ్యతలు ఉంటాయి. మూడు అంతస్తుల భవనంలో ఈ పనులన్నింటినీ ఒక్క ఉద్యోగి నిర్వహించడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.విద్యార్థులు, నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అలాంటి విజ్ఞాన కేంద్రంలో సిబ్బంది కొరత కారణంగా పాఠకులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో భవనాన్ని నిర్మించడం ఎంత ముఖ్యమో, దాని నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించడం కూడా అంతే ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు.ఈ సందర్భంగా కీసర మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కర్రె గణేష్ మాట్లాడుతూ.. సమాజంలో విద్యాభివృద్ధికి, ప్రజల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజాధనంతో నిర్మించిన గ్రంథాలయాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తగిన సిబ్బందిని కేటాయించాలని కోరారు. కీసర గ్రంథాలయానికి పూర్తిస్థాయి సిబ్బందిని వెంటనే నియమించి, విద్యార్థులు, నిరుద్యోగులు, పాఠకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, గ్రంథాలయ శాఖ ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. తగిన సిబ్బంది, నిరంతర పర్యవేక్షణ ఉంటేనే ఈ గ్రంథాలయం భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని కర్రె గణేష్ అన్నారు.