ఆపదలో ఆపన్నహస్తం.. బాధితుడికి అండగా డా.మహేందర్‌రెడ్డి!
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ :
రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి సకాలంలో అండగా నిలిచి ప్రభుత్వ చీఫ్‌విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి మానవత్వం చాటుకున్నారు. కార్యక్రమానికి వెళుతున్న సమయంలో ప్రమాద బాధితుడిని గమనించి తన వాహనాన్ని ఆపి, ఆసుపత్రికి తరలించడంతోపాటు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. మల్కాజిగిరిలో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వెళుతున్న క్రమంలో మౌలాలి పరిసరాల్లోని ఆనంద్‌బాగ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురై అచేతనంగా పడి ఉన్న వరంగల్‌కు చెందిన సురేష్‌ను మహేందర్‌రెడ్డి గమనించారు. వెంటనే స్పందించి స్థానిక ట్రాఫిక్ సిబ్బంది, తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది సహకారంతో బాధితుడిని పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. కూరగాయల వ్యాపారం చేసే సురేష్ మార్కెట్‌కు వెళుతుండగా లారీ ఢీకొట్టిందని తెలిసింది. బాధితుడికి మెరుగైన వైద్యం అందించేందుకు గాంధీ ఆసుపత్రికి తరలించాలని మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ఆసుపత్రి వర్గాలకు ఫోన్ చేసి బాధితుడి పరిస్థితిని వివరించి, తగిన చికిత్స అందించాలని సూచించారు. ఈ సమయంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ సైతం మహేందర్‌రెడ్డికి తోడుగా నిలిచి బాధితుడికి అవసరమైన సహాయం అందేలా సహకరించారు. తనకు సకాలంలో సాయం అందించిన మహేందర్‌రెడ్డికి సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని మహేందర్‌రెడ్డి సూచించారు. ప్రమాద సమయంలో బాధితులకు సకాలంలో సహాయం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆయన చూపిన మానవత్వంపై స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేశారు.