కొదురుపాకలో దారుణం: బెట్టింగ్ అప్పుల కోసం అమ్మమ్మనే దోచుకున్నాడు.. నిందితుడు అరెస్ట్
సూర్య బోయినపల్లి మండలం కొదురుపాకలో దారుణం చోటుచేసుకుంది. ఆన్ లైన్ బెట్టింగ్ అప్పుల కోసం మనవడే సొంత అమ్మమ్మ మెడలోని బంగారు గొలుసును దోచుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
కోనరావుపేట మండలం పల్లె నిజామాబాద్ కు చెందిన ముష్ణం వెంకటేష్ (29), తండ్రి అంజయ్య హైదరాబాద్ లో ఐటీఐ పూర్తి చేసి ఎలక్ట్రీషియన్ గా పనిచేసేవాడు. బెట్టింగ్ కు అలవాటు పడి మొదట కొంత గెలిచినా, తర్వాత పెద్ద మొత్తంలో పోగొట్టుకున్నాడు. భార్య నగలను తాకట్టు పెట్టి, తెలిసిన వారి వద్ద అప్పులు తెచ్చి బెట్టింగ్ లో పోగొట్టుకున్నాడు.
నవంబర్ 18న సాయంత్రం పల్సర్ బైక్ పై కొదురుపాకకు వచ్చి, మంకీ క్యాప్ ధరించి అమ్మమ్మ బొంగొని రాజవ్వ ఇంట్లోకి ప్రవేశించి, లైట్ ఆఫ్ చేసి నోటికి తువ్వాలు అడ్డుపెట్టి బెదిరించి 10 గ్రాముల గొలుసు లాక్కొని పరారయ్యాడు.
రాజవ్వ కుమారుడు లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో బోయినపల్లి ఎస్ఐ రమాకాంత్ కేసు నమోదు చేశారు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ దర్యాప్తులో శుక్రవారం ఉదయం కొదురుపాక ఎక్స్ రోడ్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకొని గొలుసు, బైక్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.
బెట్టింగ్ వల్ల నేరాల వైపు మళ్లుతున్నారని, యువత దూరంగా ఉండాలని డీఎస్పీ సూచించారు.