కీసరలో మరో ఏసీబీ వల.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్‌ఐ అరెస్ట్
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:
కీసర పోలీస్‌స్టేషన్‌లో మరో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చార్జిషీట్‌లో అనుకూలంగా వ్యవహరించడంతోపాటు త్వరగా దాఖలు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఎస్‌ఐ కొండారెడ్డి శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి నుంచి రూ.2 లక్షలు స్వీకరిస్తుండగా నాగారం పరిధిలోని శిల్పానగర్ కాలనీలో సోమవారం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ వివరాలను హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ వెల్లడించారు.
రూ.5 లక్షలు డిమాండ్.. రూ.2 లక్షలకు ఒప్పందం
కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై చీటింగ్, 498ఏ కేసులు నమోదయ్యాయి. బెయిల్‌పై ఉన్న సదరు వ్యక్తి కోర్టు ఆదేశాల మేరకు ప్రతి సోమవారం పోలీస్‌స్టేషన్‌లో హాజరవుతున్నాడు. ఈ క్రమంలో కేసు చార్జిషీట్‌లో అనుకూలంగా వ్యవహరించడంతోపాటు త్వరగా దాఖలు చేసేందుకు ఎస్‌ఐ కొండారెడ్డి శ్రీనివాస్ రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అంత మొత్తం చెల్లించలేనని బాధితుడు చెప్పడంతో చివరకు రూ.2 లక్షలకు ఒప్పందం కుదిరింది. నగదు ఇవ్వాలని ఎస్‌ఐ తరచూ ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చినట్లు వెల్లడించారు.
శిల్పానగర్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
ఎస్‌ఐ వేధింపులతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు లంచం నగదును కవర్‌లో పెట్టుకుని నాగారం పరిధిలోని శిల్పానగర్ కాలనీకి వెళ్లాడు. అక్కడ ఎస్‌ఐ రూ.2 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ బృందం దాడి చేసి పట్టుకుంది. అనంతరం ఎస్‌ఐను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ గంగసాని శ్రీధర్ వెల్లడించారు.
లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయాలి
ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబరు 1064కు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
కీసరలో వరుస ఏసీబీ కేసులతో కలకలం
ఈ ఏడాది ఫిబ్రవరిలో హోంగార్డు నగేష్ వ్యవహారం, సెప్టెంబరు 17న కీసర సీఐ, ఎస్‌ఐలపై చర్యలు, అక్టోబరు 15న డిప్యూటీ తహసీల్దార్ ఉదంతం.. తాజాగా నవంబరు 9న ఎస్‌ఐ కొండారెడ్డి శ్రీనివాస్ అరెస్టుతో కీసర ప్రాంతంలో వరుస ఏసీబీ కేసులు చర్చనీయాంశంగా మారాయి. పోలీసు, రెవెన్యూ శాఖల్లో వరుసగా అవినీతి ఘటనలు వెలుగుచూస్తుండటంతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిరోధక చర్యలు, అధికారుల పర్యవేక్షణపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.