కీసర పోలీస్ స్టేషన్‌లో మరో అవినీతి కలకలం.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ
కీసర, మేజర్ న్యూస్:కీసర పోలీస్ స్టేషన్‌లో మరో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్‌ఐ శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. ఒకే పోలీస్ స్టేషన్‌లో వరుసగా లంచం కేసులు వెలుగులోకి రావడం పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది.ఒక కేసుకు సంబంధించి చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఎస్‌ఐ శ్రీనివాస్ రూ.2 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, సోమవారం నాగారం పరిధిలోని శిల్పానగర్‌లో లంచం సొమ్ము తీసుకుంటుండగా ఎస్‌ఐను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలుస్తోంది.ఇదే పోలీస్ స్టేషన్‌లో ఇటీవల సీఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన మరువకముందే తాజాగా మరో ఎస్‌ఐ అవినీతి నిరోధక శాఖకు చిక్కడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఒకే పోలీస్ స్టేషన్‌లో వరుసగా అవినీతి కేసులు వెలుగులోకి వస్తుండటంతో పోలీస్ శాఖలో అంతర్గత పర్యవేక్షణ, అధికారుల జవాబుదారీతనంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.