కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి
పంట రుణాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలి.. బ్యాంకర్లకు అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి సూచన
(రంగారెడ్డి -మేజర్ న్యూస్) కరువు ప్రభావిత రైతులకు బ్యాంకులు ఆర్థికంగా అండగా నిలవాలని, అర్హులైన రైతుల పంట రుణాలను నిబంధనల ప్రకారం దీర్ఘకాలిక రుణాలుగా పునర్వ్యవస్థీకరించి సకాలంలో ఉపశమనం కల్పించాలని అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) డాక్టర్ కిరణ్మయి బ్యాంకర్లను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మార్గదర్శకత్వంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సుశీల్ కుమార్ కె.పి. ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ) సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.03 (24-10-2026) ప్రకారం ఆర్బీఐ మార్గదర్శకాలు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్‌బీసీ) తీర్మానాలను బ్యాంకులు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.
జిల్లాలో మొత్తం 18 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామని, వీటిలో 5 మండలాలు తీవ్ర కరువు ప్రభావిత ప్రాంతాలు కాగా, మరో 13 మండలాలు మధ్యస్థ కరువు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయని తెలిపారు. మధ్యస్థ కరువు ప్రభావిత మండలాల్లో అర్హులైన రైతులకు 12 నెలల మారటోరియంతో పాటు తదుపరి 24 నెలల వరకు రుణ చెల్లింపులకు గడువు కల్పించనున్నట్లు వివరించారు. అదేవిధంగా తీవ్ర కరువు ప్రభావిత మండలాల్లో 12 నెలల మారటోరియంతో పాటు తదుపరి 48 నెలల వరకు రుణ చెల్లింపుల వెసులుబాటు కల్పించే విధానం అమలు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ.. బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించి అర్హులైన రైతులను గుర్తించాలని, రుణాల పునర్వ్యవస్థీకరణ ద్వారా కలిగే ప్రయోజనాలపై వారికి అవగాహన కల్పించాలని కోరారు. రైతులకు అవసరమైన కొత్త రుణాలను కూడా సకాలంలో అందించాలని సూచించారు.
ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ రుణాల పునర్వ్యవస్థీకరణ విధానం, అర్హతలు, అమలు ప్రక్రియపై వివరించగా, నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ హర్ష రైతులకు అందించాల్సిన రుణ ఉపశమన చర్యలను వివరించారు. పంటల బీమా పరిహారం అందే వరకు వేచి చూడకుండా అర్హత మేరకు రైతులకు అదనపు ఆర్థిక సహాయం, తాజా రుణాలు అందించాలని సమావేశంలో సూచించారు.
కరువు పరిస్థితుల్లో రైతులపై రుణ వసూళ్ల విషయంలో బ్యాంకులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులకు అండగా నిలవాలని అధికారులు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎల్‌డీఎం సుశీల్ కుమార్, పీడీ డీఆర్డీఏ శ్రీలత, పీడీ మెప్మా వెంకటనారాయణ, వ్యవసాయ శాఖ అధికారి సుజాతతో పాటు వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు