జిల్లాల్లోనే 90 శాతం వైద్య సేవలు అందించాలి! మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు
సంగారెడ్డి : రాష్ట్రంలోని ప్రజలకు కనీసం 90 శాతం వైద్య సేవలు జిల్లాల్లోనే అందుబాటులోకి తీసుకురావాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య పరికరాలు, అవసరమైన సిబ్బంది, మౌలిక వసతులు కల్పించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు.సోమవారం జూబ్లీహిల్స్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో సెకండరీ హెల్త్‌కేర్ డైరెక్టరేట్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల భవన నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్. చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, వివిధ జిల్లాల డీసీహెచ్‌ఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలల భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్ మంత్రికి వివరించారు. సెకండరీ హెల్త్‌కేర్ డైరెక్టరేట్ పరిధిలో ఇప్పటివరకు తొమ్మిది ఆసుపత్రి భవనాల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. డిసెంబర్ నాటికి మరో 14 భవనాలు, 2027 మార్చి నాటికి మరో 11 భవనాల నిర్మాణాలు పూర్తవుతాయని వెల్లడించారు. మరో 45 భవనాల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు.దీనిపై మంత్రి స్పందిస్తూ నిర్మాణాలు పూర్తయిన తొమ్మిది ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య పరికరాలు, ఫర్నిచర్‌ను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. డిసెంబర్, మార్చి నాటికి పూర్తయ్యే ఆసుపత్రులకు అవసరమైన పరికరాలు, ఫర్నిచర్ కొనుగోలు ప్రక్రియను ఇప్పుడే ప్రారంభించాలని సూచించారు. డీఎస్‌హెచ్ పరిధిలో నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలను వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
జిల్లాల్లో వైద్య సేవల విస్తరణకు ప్రాధాన్యం
జిల్లాల్లోని ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పనితీరుపై మంత్రి సమీక్షించారు. కనీసం 90 శాతం మంది రోగులకు జిల్లాల్లోనే వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో ఈ ఆసుపత్రుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజలు చిన్న చిన్న వైద్య అవసరాల కోసం హైదరాబాద్‌కు రావాల్సిన పరిస్థితి లేకుండా జిల్లాల్లోనే మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు.గత మూడు సంవత్సరాల్లో వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణులు సహా ఆరోగ్యశాఖలో సుమారు 15 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు. సెకండరీ హెల్త్‌కేర్ డైరెక్టరేట్ పరిధిలోని ఆసుపత్రుల కోసం ఇటీవలే 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించిన విషయాన్ని గుర్తుచేశారు. అవసరమైన వైద్య పరికరాలు సమకూరుస్తున్నామని, నూతన ఆసుపత్రి భవనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సమర్థంగా వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత జిల్లా వైద్య ఆరోగ్య సేవల సమన్వయ అధికారులు (డీసీహెచ్‌ఎస్‌లు), ఆసుపత్రుల సూపరింటెండెంట్లపై ఉందని మంత్రి స్పష్టం చేశారు.
ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు జాగ్రత్తలు
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఆసుపత్రుల్లో తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోగులు, వారి సహాయకులకు ఇబ్బందులు కలగకుండా ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక వసతులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.జిల్లా స్థాయి ఆసుపత్రులను బలోపేతం చేయడంతో పాటు నిర్మాణంలో ఉన్న వైద్య భవనాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.