జిల్లా కేంద్రంలో వినోదానికి కొత్త శోభ - జిల్లా కలెక్టర్ కె.హరిత
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్‌లో ప్రజలకు ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో పిక్చర్ టైమ్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సమన్వయంతో గాలి బుడగల నిర్మాణంతో రూపొందించిన ఆధునిక సినిమా థియేటర్‌ను పునః ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన గాలి బుడగల థియేటర్ ప్రారంభించడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన వినోద సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని, మహిళా సంఘాల సహకారం, సమన్వయంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. పిక్చర్ టైమ్ సినిమా థియేటర్‌లో పుష్‌బ్యాక్ సీట్లు, ఎయిర్ కండిషనింగ్, డాల్బీ సౌండ్ వంటి ఆధునిక సదుపాయాలతో పాటు ఆహార పదార్థాలు, పానీయాలు అందుబాటులో ఉంటాయని, జిల్లా ప్రజలు, యువత, కుటుంబాలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.