ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంతృప్తిఎన్నికల భద్రతకు పటిష్ట చర్యలు.. 7,500 మంది సిబ్బంది నియామకానికి చర్యలు
భీమవరం, సూర్య న్యూస్: పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా సాగుతోందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ తీరును, అక్కడి ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
జిల్లాలో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆకివీడు, నరసాపురం మున్సిపాలిటీలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారని వెల్లడించారు. గురువారం సుమారు 30 వరకు జెడ్పీటీసీ నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు.
ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారని చెప్పారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించి, జిల్లా ఎస్పీతో పాటు పోలీసు యంత్రాంగం సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
ఎన్నికల నిర్వహణకు సుమారు 7,500 మంది సిబ్బంది అవసరమని, వారికి విధులు కేటాయించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.