telangana
జాతీయ స్థాయి ఆల్ ఇండియా యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో సత్తా చాటిన ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల విద్యార్థి ధనుష్
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : రాజస్థాన్ జైసల్మేర్ వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక 'ఆల్ ఇండియా యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్' మరియు డెసర్ట్ సఫారీ క్యాంపులో కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన ఎన్సీసీ కేడెట్ తృతీయ సంవత్సరం బిఎస్సి ఎంపీసీఎస్ పి.ధనుష్ అసాధారణ ప్రతిభ కనబరిచి, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. పది రోజుల పాటు సాగిన ఈ జాతీయ శిక్షణ శిబిరంలో దేశ విదేశాల నుంచి కేడెట్లు పాల్గొన్నారు. క్యాంపులో భాగంగా డెసర్ట్ మరియు క్యామెల్ సఫారీ వంటి సాహస క్రీడలతో పాటు, వివిధ ప్రాంతాల సంస్కృతుల మార్పిడి కార్యక్రమాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించే ప్రత్యేక శిక్షణ పొందారు. అంతేకాకుండా, జైసల్మేర్ చారిత్రక కట్టడాలు, దేశ సరిహద్దు ప్రాంతాలను సందర్శించడం ద్వారా మన రక్షణ వ్యవస్థ పనితీరుపై, 'భిన్నత్వంలో ఏకత్వం' భావనపై సంపూర్ణ అవగాహన సాధించారు. ఈ అంతర్జాతీయ స్థాయి శిబిరంలో మన దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, చరిత్రను ఇతర దేశాల ప్రతినిధులకు వివరించడం ఎంతో గర్వకారణమని ధనుష్ తెలిపారు.జాతీయ స్థాయిలో కళాశాల కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన విద్యార్థి ధనుష్‌ను కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ మరియు ఎన్సీసీ కోఆర్డినేటర్ లెఫ్టినెంట్ డాక్టర్ ఎ. సుధాకర్ ఘనంగా సన్మానించి అభినందించారు.ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. కళాశాలకు చెందిన ఎన్సీసీ విద్యార్థి ధనుష్ జాతీయ స్థాయి వేదికపై ఉత్తమ ప్రతిభ కనబరచడం కళాశాలకే కాదు, ఉమ్మడి జిల్లాకే గర్వకారణం. చదువుతో పాటు ఇలాంటి సాహసవంతమైన, దేశభక్తిని చాటే కార్యక్రమాలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలి. భావితరాలకు ధనుష్ ఒక ఆదర్శం. క్రమశిక్షణ, అంకితభావం ఉంటే ఏ రంగంలోనైనా విజయాలు సాధించవచ్చని ధనుష్ నిరూపించాడు" అని కొనియాడారు.