900 గజాలు-200 రకాలకు పైగా మొక్కలు,చెట్లు ఇది వల్లభనేని కుమార స్వామి ఘనత
హైదర్ నగర్ డివిజన్లోని గౌతమి నగర్ రోడ్ నెంబర్ మూడులో లో ఉన్న ఆ ఇంటిని చూస్తే ఆ ఇంటి యాజమానిలో ప్రకృతి ప్రేమికుడు ఉన్నాడని అనిపించక మానదు. రకరకాల అరుదైన మొక్కలు వాటికి పూచిన పూలతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇంటి ఆవరణలోకి ప్రవేశిస్తే అందమైన మొక్కలు మనకు అంతగా పరిచయం లేని వివిధ రకాల పూల చెట్లు దర్శనమిస్తాయి. ఆ ఇంటి యాజమాని పేరే ఎంతో కాలంగా అందరికీ సుపరిచితుడైన వల్లభనేని కుమారస్వామి.
సెంటు స్థలం ఉంటే టిక్కీ లాంటి గదులుగట్టి వేలకి వేలు సంపాదించే మన మహానగరంలో తన ఇంటి నానుకొని ఉన్నటువంటి సుమారు 900 గజాల స్థలంలో ఎన్నో రకాలైన పళ్ళు, పూలు, అలంకార, ఔషధ మొక్కలు పెంచుతూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. మందారం కనకాంబరం, నూరువరహాలు, మధుమాలతి, విరజాజి,కలువ, రాధాకృష్ణ, బిళ్ళగన్నేరు, సంపంగి, దేవగన్నేరు తదితర సుమారు 60 రకాలకు పైగా మొక్కలతో వాటి నిండా పూచిన పూలతో కనులకింపుగా ఉండటమే కాకుండా చక్కటి పరిమళాలు వెదజల్లుతున్నాయి. చాలా అరుదుగా కనిపించే మందారం పువ్వు దాదాపు అరచేతిలో పట్టనంత పెద్దదిగా ఉండి కనులు తిప్పుకోకుండా చేస్తాయి.
బెండ,బీర, దొండ, పొట్ల, మునగ, టమోటా, తదితర 30 కి పైగా కూరగాయల మొక్కలతో మరియు పాలకూర,చుక్కకూర, గోంగూర, బచ్చలి కూర తదితర ఆకుకూరలు పెరడు నిండుగా కాస్తున్నాయి. మామిడి, సపోటా, సీతాఫలం, ఆపిల్, వాటర్ ఆపిల్, బ్లూబెర్రీ,జామ, లిచ్చి మొదలగు 50 రకాలైన చెట్లతో ఆ స్థలం ఔరా అనిపిస్తుంది. జెడ్ జెడ్,అలోవెరా, పీస్ లిల్లీ, స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్ తదితర 50 రకాలకు పైగా అలంకారం మొక్కలతో మూడు రకాల ఎత్తులతో శాస్త్రీయంగా పెంచుతున్నాడు.
నిత్యం తను తన శ్రీమతి అయిన ఉమా తో కలిసి దాదాపు రెండు గంటలకు పైగా తోట పని చేస్తేనే ఆరోజు సంతృప్తిస్తుందని లేదా ఏదో వెలితిగా ఉంటుందని చెప్పాడు. అదే తన ఆరోగ్య రహస్యమని తను రిటైర్ అయి దాదాపు 10 సంవత్సరాలు అయినప్పటికీ తను ఆరోగ్యంగా ఉండటానికి తన మొక్కలు ఎంతో దోదపడుతున్నాయని చెప్పారు.
మొక్కలను సేంద్రియ పద్ధతిలో పెంచుతూ వాతావరణం కాలుష్యం కాకుండా తన వంతు ప్రకృతి సేవ చేస్తున్నాడు. తనకు అవసరమైన ఎరువును కంపోస్ట్ పద్ధతిలో మరియు ద్రావణ రూపంలో తయారు చేస్తూ చెట్లకు బలాన్నిస్తూ పురుగులను చీడలను అరికడుతున్నాడు. ఇల్లు కట్టి అద్దెకిచ్చి సంపాదించే అవకాశాన్ని వదులుకొని నెలకు పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతూ తనకున్న ప్రకృతి ప్రేమను చాటుతున్నాడు. అంతేకాక ఎవరికైనా మొక్కలు అవసరం ఉన్న తన పెరట్లోని మొక్కలను సంతోషంగా ఉచితంగా ఇచ్చి పైగా వాటిని ఎలా పెంచా లో మెలకువలను నేర్పి తన దానగుణం చాటుకుంటున్నారు. తద్వారా మొక్కల వ్యాప్తికి తోడ్పడుతున్నాడు. అంతేగాక ఆ రోడ్డులో మొక్కలను పెంచి పెద్ద చేయడంతో అవి ఇప్పుడు పెద్ద చెట్లుగా ఎదిగి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పళ్ళు కూరగాయలు ఆకుకూరలు పూర్తిగా ఉచితంగా చుట్టుపక్కల వారికి సంతోషంగా పంచి పెడుతూ సేంద్రీయ ఉత్పత్తుల రుచులను అందజేస్తున్నారు.
అరుదైన దక్షిణ అమెరికాకు చెందిన కలికో జాతి మొక్క కూడా ఇక్కడ కనబడుతుంది. దాని పూలు విచిత్ర ఆకృతిలో ఉంటాయి.
తన పెరడు పక్కనే ఉన్న భవ్యస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్ వారు ఇటీవల నిర్వహించిన వన మహోత్సవం లో పాల్గొని తన పెరట్లో నుంచి ఎన్నో మొక్కలను ఉచితంగా ఇచ్చి అవి నిలదొక్కుకోవడానికి తన వంతు సహాయం చేశారని అపార్ట్మెంట్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులకు తన పెరట్లోని మొక్కల గురించి నేర్చుకుంటే వారికి చాలా ఉపయోగ ఉంటుందని అలా విద్యార్థులు వస్తే వారికి ప్రత్యక్షంగా అన్ని నేర్పుతానని చెప్పారు.
ఇంకొక విషయం ఈయన సీనియర్ సిటిజన్స్ సంస్థల్లో చేరి వారికి చేదోడువాదోడుగా ఉంటూ వారి మన్ననలను పొందుతున్నారు.