హైమాక్స్ స్తంభాన్నే మింగేస్తున్న అక్రమ నిర్మాణం!
రహదారి ఆక్రమణ.. సెట్‌బ్యాక్ నిబంధనలకు తూట్లు!
ఫిర్యాదులు చేసినా స్పందించని టౌన్ ప్లానింగ్ అధికారులు
గండిపేట మేజర్ న్యూస్: అక్టోబర్ 24
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నిర్లక్ష్యం విమర్శలకు తావిస్తోంది. హైదర్‌షాకోట్ డివిజన్ హిమగిరి నగర్ కాలనీలో ఓ నిర్మాణదారుడు రహదారిని ఆక్రమిస్తూ, హైమాస్ట్ లైటింగ్ స్తంభాన్ని ఆనుకుని నిర్మాణ పనులు చేపడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సెట్‌బ్యాక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పనులు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.
ఈ నిర్మాణంపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులే మౌనం వహిస్తే ప్రజా ఆస్తులకు రక్షణ ఎక్కడని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించాలి!
నిర్మాణ అనుమతులు, రహదారి హద్దులు, సెట్‌బ్యాక్‌లు, హైమాస్ట్ స్తంభానికి కలుగుతున్న ఆటంకాలపై తక్షణమే క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఉల్లంఘనలు నిర్ధారణైతే చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు, ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించిన అధికారుల బాధ్యతను కూడా తేల్చాలని కోరుతున్నారు. అక్రమ నిర్మాణం పూర్తయ్యాక మేల్కొంటారా? ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా? అన్నది వేచి చూడాలి.