అంబాజీపేట ఎంపీటీసీ అభ్యర్థిగా గణపతి అనంత తులసి వీర రాఘవులుకి కూటమి శ్రేణుల సంపూర్ణ మద్దతుతో విస్తృత ప్రచారం షురూ..
సహకార రంగంలో విశేష సేవలందించిన గణపతి వీర రాఘవులు ట్రాక్ రికార్డే గెలుపునకు శ్రీరామరక్ష!
సూర్య నియోజకవర్గ బ్యూరో, అంబాజీపేట: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. అంబాజీపేట ఎంపీటీసీ స్థానానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థిగా గణపతి అనంత తులసి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కూటమి అగ్రనాయకులు, శ్రేణుల సంపూర్ణ మద్దతుతో మండలంలో భారీ మెజారిటీయే లక్ష్యంగా విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. సహకార రంగంలో దశాబ్దాల పాటు నిస్వార్థ ప్రజాసేవలు అందించిన సీనియర్ టీడీపీ నేత గనపతి వీర రాఘవులు సతీమణిగా ఆమె బరిలో నిలవడంతో స్థానిక ప్రజలు, వ్యాపారులు, రైతు వర్గాల్లో విశేష ఆదరణ లభిస్తోంది.
సహకార రంగంలో గణపతి వీర రాఘవులు చెరగని ముద్ర:
గణపతి వీర రాఘవులు ప్రజాసేవలో తనదైన రికార్డును నెలకొల్పారు. 2005 నుంచి 2019 వరకు సుదీర్ఘంగా 14 సంవత్సరాల పాటు అంబాజీపేట సొసైటీ అధ్యక్షుడిగా విశేష సేవలు అందించి, రైతుల సంక్షేమానికి పాటుపడ్డారు. సొసైటీ పరిధిలో ఆయన అందించిన పారదర్శక సేవల గుర్తింపుగా ఇఫ్కో (IFFCO) అవార్డుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ సొసైటీ అధ్యక్షుడిగా అవార్డులు అందుకున్నారు. అనంతరం 2014-2019 కాలంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ డైరెక్టర్గా పనిచేసి రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించారు. 2009లో టీడీపీ మండల అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి విశేష సేవలందించారు.
కోనసీమ కొబ్బరి రైతులకు అండగా రూ. 5 కోట్ల ప్రాజెక్ట్:
రైతాంగ సాధికారతే ధ్యేయంగా 2017లో 'కృషివల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ'ని స్థాపించి, కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ఎంఈ 'స్ఫూర్తి' పథకం ద్వారా దాదాపు రూ. 5 కోట్ల వ్యయంతో కొబ్బరి పిప్పి (కాయిర్) పరిశ్రమ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. సుమారు 18 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ పరిశ్రమ ద్వారా కోనసీమ ప్రాంత కొబ్బరి రైతులకు ఉత్పత్తుల విలువ ఆధారిత పెంపు, పంట సమస్యలపై నిరంతర అవగాహన కల్పిస్తూ అండగా నిలిచారు. ఈ విశేష సేవలకు గుర్తింపుగా 2022లో ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తమ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీగా ప్రతిష్టాత్మక అవార్డును సైతం కైవసం చేసుకున్నారు.
పార్టీ కార్యక్రమాల్లో అగ్రగామి – భారీ మెజారిటీయే లక్ష్యం:
క్లస్టర్ 007 ఇన్ఛార్జ్గా కొనసాగుతూ టీడీపీ చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, సూపర్ సిక్స్ పథకాల ప్రచారం, పార్టీ సభ్యత్వ నమోదు, కేఎస్ఎస్ కార్యక్రమాల్లో పి.గన్నవరం నియోజకవర్గంలోనే మండల స్థాయిని అగ్రస్థానంలో నిలిపారు. గత ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి అహర్నిశలు శ్రమించారు. తాజాగా జనరల్ కోటాలో ఎంపీపీ స్థానాన్ని ఆశిస్తున్న క్రమంలో, ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో ఉన్న గణపతి అనంత తులసికి స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపై నిలిచి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు చేర్చడమే ధ్యేయంగా పనిచేస్తున్న గణపతి అనంత తులసిని భారీ మెజారిటీతో గెలిపించాలని కూటమి శ్రేణులు పిలుపునిచ్చాయి.