ఎస్‌ఆర్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు.
సూర్య, నిర్మల్ ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఎస్.ఆర్. గర్ల్స్ జూనియర్ కాలేజ్, నిర్మల్ – ఐఐటీ , జెఈఈ, నీట్ అకాడమీ ఆధ్వర్యంలో అక్టోబర్ 10న మధ్యాహ్నం 2 గంటలకు కళాశాల ప్రాంగణంలో ప్రీ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో కళాశాలకు హాజరై, వివిధ రకాల రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను తయారు చేశారు. బతుకమ్మలను చుట్టూ చేరి బతుకమ్మ పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థినుల సందడి, రంగురంగుల బతుకమ్మలతో కళాశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కార్యక్రమంలో ఎస్.ఆర్ ఇన్స్టిట్యూషన్స్ డీజీఎమ్ గోవర్ధన్ రెడ్డి, జోనల్ ఇంచార్జి నాగేశ్ యాదవ్, అకాడమిక్ డీన్ రాంబాబు, ప్రిన్సిపాల్ నరేందర్ రెడ్డి పాల్గొని విద్యార్థినులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, మన సంస్కృతి వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. విద్యార్థులు ఆధునిక విద్యతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించి, వాటిని భావితరాలకు అందించాలని సూచించారు. కళాశాల అధ్యాపకులు, సిబ్బంది కూడా విద్యార్థినులతో కలిసి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థినుల సృజనాత్మకత, సంప్రదాయ దుస్తులు, బతుకమ్మ పాటలు, నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.