సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు
జహీరాబాద్;తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు రాయిపల్లి (డి) గ్రామంలో అంబరాన్నంటాయి. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మను నారింజ వాగులో గంగమ్మ ఓడికి పంపారు. గ్రామ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన వేడుకలకు మహిళలు భారీగా తరలివచ్చారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు, జానపద గీతాలు, సంప్రదాయ నృత్యాలతో హనుమాన్ దేవాలయం వద్ద బతుకమ్మ డిజే పాటలతో మహిళలు కోలహాటలు, ఆట, పాటలతో సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు ఆడిపాడుతూ పూల పండుగలో సందడి చేశారు. ప్రకృతిని ఆరాధించే అపురూప పండుగ బతుకమ్మ....!ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధానికి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. బతుకమ్మ వేడుకలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.