పసి బిడ్డ ప్రాణాల కోసం తల్లిదండ్రుల ఆరాటం - దాతల ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
అనపర్తి మేజర్ న్యూస్.పుట్టి ఏడు నెలలు కూడా నిండని ఆ పసికందుకు అప్పుడే ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్య ఎదురైంది. అమ్మ ఒడిలో హాయిగా ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఆ చిన్నారిది. బిడ్డకు ఏ కష్టం వచ్చినా తమ కష్టంగా భావించే తల్లిదండ్రులు.. ఇప్పుడు తమ బిడ్డ ఆరోగ్యం కోసం కన్నీరుమున్నీరవుతున్నారు. కాలేయ మార్పిడి చేస్తేనే చిన్నారి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ బిడ్డకు మెరుగైన వైద్యం అందించేందుకు దాతల సాయం కోసం ఆ కుటుంబం దీనంగా ఎదురుచూస్తోంది.
అనపర్తి నియోజకవర్గం,రంగంపేట మండలం దొంతమూరు సమీపంలోని వీరంపాలెం పాకల ప్రాంతానికి చెందిన ఈలి సూర్యప్రకాష్, రామలక్ష్మి దంపతులకు ఏడు నెలల చిన్నారి ఉన్నాడు. జన్మించిన కొద్ది రోజులకే చిన్నారికి కాలేయ సంబంధిత ఆరోగ్య సమస్య తలెత్తింది. దీంతో పుట్టిన 15 రోజులకే రాజానగరంలోని జీఎస్‌ఎల్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించారు. తమ బిడ్డకు నయమవుతుందని ఆశతో తల్లిదండ్రులు అప్పటి నుంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, చిన్నారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలంటే కాలేయ మార్పిడి అవసరమని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కళ్లముందే పెరగాల్సిన పసిబిడ్డ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుండటాన్ని చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. బిడ్డకు మెరుగైన వైద్యం అందించి ఆరోగ్యంగా తమ మధ్య ఎదగాలని వారు ఆశిస్తున్నారు. అయితే, కాలేయ మార్పిడి వంటి ఖరీదైన వైద్య ప్రక్రియను చేయించుకోవడం వారికి ఆర్థికంగా భారంగా మారే పరిస్థితి నెలకొంది. ఒకవైపు బిడ్డ ఆరోగ్యం.. మరోవైపు చికిత్స కోసం అవసరమైన ఖర్చులు.. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఆపన్నహస్తం అందిస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నారు.
ఈ చిన్నారికి అవసరమైన కాలేయ మార్పిడి చికిత్సకు సహాయం అందించి, ఆ కుటుంబానికి అండగా నిలవాలని తల్లిదండ్రులు దాతలు, సేవాభావం కలిగిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నారి వైద్య చికిత్సకు తమకు తోచిన ఆర్థిక సహాయం అందిస్తే, ఆ కుటుంబానికి ఎంతో ఊరట కలుగుతుందని పేర్కొంటున్నారు. మానవత్వంతో స్పందించి పసిబిడ్డకు మెరుగైన వైద్యం అందేలా సహకరించాలని కోరుతున్నారు. సహాయం చేయదలచిన వారు నెం.
9908598479, 9640585070 కు సహాయం అందించాలని కోరారు.