రాష్ట్ర పక్షి పాలపిట్టను కాపాడాలి దసరా వేడుకల్లో పాలపిట్టలకు హాని చేయొద్దు
సిద్దిపేట;తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను సంరక్షించాలని సిద్దిపేట జిల్లా అటవీ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దసరా పండుగ సందర్భంగా సంప్రదాయాల పేరుతో పాలపిట్టలను పట్టుకోవడం, విక్రయించడం, హింసించడం వంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని సూచించింది. వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేసింది.వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం పాలపిట్టలను పట్టుకోవడం, విక్రయించడం లేదా హింసించడం నేరమని అటవీ శాఖ తెలిపింది. ఈ పక్షికి చట్టపరమైన రక్షణ ఉందని పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని వెల్లడించింది.ప్రజలందరూ పాలపిట్టలను కాపాడుతూ, మూగజీవాలకు హాని కలగకుండా దసరా పండుగను ఆనందంగా జరుపుకోవాలని అటవీ శాఖ కోరింది. ఎవరైనా పాలపిట్టలను పట్టుకున్నా, విక్రయించినా లేదా ప్రదర్శించినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించింది.సమాచారం అందించాల్సిన సహాయ నంబర్లు:18004255364,9803338666పాలపిట్టల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా అటవీ అధికారి ఎ. పద్మజారాణి విజ్ఞప్తి చేశారు.