రామచంద్రపురం అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి :మంత్రి వాసంశెట్టి సుభాష్
రామచంద్రపురం, మేజర్ న్యూస్.:రామచంద్రపురం మున్సిపాలిటీ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు నిరంతరాయంగా కొనసాగేందుకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావుతో పాటు పట్టణంలోని 32 వార్డుల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజలకు పిలుపునిచ్చారు.
రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావుకు మద్దతుగా మంత్రి సుభాష్ సోమవారం పట్టణంలోని 4,22 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యావంతుడైన మేడిశెట్టి శేషారావుకు 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, ప్రజా సమస్యలపై అవగాహనతో పాటు పట్టణ అభివృద్ధికి అవసరమైన అనుభవం కూడా ఆయనకు ఉందన్నారు. అటువంటి నాయకుడిని మున్సిపల్ చైర్మన్‌గా గెలిపించి రామచంద్రపురం అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తనపై నమ్మకంతో 8,500 ఓట్ల మెజారిటీని అందించి గెలిపించారని మంత్రి సుభాష్ గుర్తుచేశారు. అదే నమ్మకాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగిస్తూ, ఈసారి 12 వేల నుంచి 15 వేల ఓట్ల భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గత రెండేళ్లుగా పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనించాలని మంత్రి సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. పట్టణంలో మరింత అభివృద్ధి సాధించాలంటే మున్సిపాలిటీలోనూ కూటమి బలమైన పాలన ఉండాలని పేర్కొన్నారు. అందువల్ల 32 వార్డుల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి ప్రజలు తమ మద్దతు తెలియజేయాలని కోరారు.
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు మాట్లాడుతూ రామచంద్రపురం పట్టణ అభివృద్ధికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనకు ఒక అవకాశం కల్పించి ఆశీర్వదించాలని, ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను కోరారు. అంతకుముందు మేడిశెట్టి శేషారావు పట్టణంలోని పలువురు ప్రముఖులను వ్యక్తిగతంగా కలిసి, తన విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, ఆయా వార్డుల్లో కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.