telangana
చెట్టుకు ఢీకొని ఇద్దరు యువ కార్మికులు దుర్మరణం
శామీర్ పేట, మేజర్ న్యూస్:ఓ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు యువ కార్మికులు అర్ధరాత్రి పూట బైక్ పై వెళ్తూ ప్రమాదవశాత్తు చెట్టుకు ఢీకొని దుర్మరణం చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఆదివారం అర్ధరాత్రి అలియాబాద్ సమీపంలోని బ్రిందా కన్వెన్షన్ హాల్ సమీపంలో ఆర్ అండ్ బి రోడ్డులో జరిగింది. బాధితుల, పోలీసుల కథనం ప్రకారం ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాస్మోస్ మార్కి(22), సుమిత్ కుళ్ళు (23)అనే ఇద్దరు యువకులు కొన్నేళ్లుగా అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని డైనమిక్ కంపెనీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. కాగా వీరిలో కాస్మోస్ అనే యువకుడు అలియాబాద్ లో నివాసం ఉంటుండగా, సుమిత్ బాలానగర్ లో నివాసం ఉంటున్నాడు. కాగా ఈనెల 18న ఆదివారం రాత్రి వీరిద్దరు కార్మికులు యధావిధిగా సెకండ్ షిఫ్టులో ఆ కంపెనీలో జాబ్ వరకు చేశారు. అలాగే ఆరోజు రాత్రి ఆ కంపెనీలో నిర్వహించిన దసరా ఉత్సవాల దావత్ లో మిగతా కార్మికులతో పాటు ఆ ఇద్దరు కార్మికులు కూడా పాల్గొని ఎంజాయ్ చేశారు. అనంతరం అదే రాత్రి ఆ ఇద్దరు కార్మికులు కాస్మోస్, సుమిత్ లు టిజి 08 బిఎ 0904 నెంబర్ గల బైక్ పై డైనమిక్ కంపెనీ నుంచి బయలుదేరి అలియాబాద్ చౌరస్తా నుంచి ఆర్ అండ్ బి రోడ్డులో అలియాబాద్ గ్రామం వైపునకు అతివేగంగా, అ జాగ్రత్తగా వస్తున్నారు. కాగా రాత్రి దాదాపు 11:30 గంటల సమయంలో అలియాబాద్ సమీపంలోని ఆర్ అండ్ బి రోడ్డు లోని బ్రిందా కన్వెన్షన్ హాల్ సమీపానికి రాగానే ఆ బైకు ప్రమాదవశాత్తు ఆ రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు బలంగా ఢీకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో అ ఇద్దరు యువకులు కాస్మోస్, సుమిత్ లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వారి బైకు కూడా ప్రమాదంలో రెండు ముక్కలై ధ్వంసం అయింది. ఈ సంఘటన స్థలానికి సంబంధిత జీనోమ్ వ్యాలీ పోలీస్ ఇన్స్పెక్టర్ గురవయ్య వెంటనే వెళ్లి ఆ రోడ్డు ప్రమాద పూర్వాపరాలను పరిశీలించి విచారణ జరిపారు. ఆ ఇద్దరి కార్మికుల మృతదేహాల పై పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టంకై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్మికుల మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.