ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలన...!!
ఆనందపురం, సూర్య: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆనందపురం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి పూర్ణిమాదేవి ఎన్నికల ఏర్పాట్లను ఆయనకు వివరించారు. మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ, బ్యాలెట్ పత్రాలు, నామినేషన్ల స్వీకరణ తదితర అంశాలపై ఎంపీడీవో బి. సత్యనారాయణ, తహసీల్దార్ శ్రీనుబాబుకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, డిప్యూటీ ఎంపీడీవో శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.