మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన అమ్మవారు లొద్దిపల్లెలో వైభవంగా బోనాల సమర్పణ
మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన అమ్మవారు
లొద్దిపల్లెలో వైభవంగా బోనాల సమర్పణ
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఓర్వకల్లు మండలంలోని లొద్దిపల్లె, హుస్సేనాపురం, నన్నూరు గ్రామాల్లో అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
లొద్దిపల్లెలో శ్రీ శక్తి కమిటీ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దుర్గమ్మ దేవికి బోనాలు సమర్పించి, అక్కడి నుంచి సుంకులమ్మ దేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం మేళతాళాల నడుమ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఉత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు భక్తులను, గ్రామ ప్రజలను ఆకట్టుకున్నాయి.
మహిషాసురుడిని సంహరించి దుష్టశక్తులపై విజయం సాధించిన అమ్మవారిని మహిషాసుర మర్దినిగా ఆరాధిస్తారు. ఈ రూపం శక్తికి, ధైర్యానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి సంకేతంగా భక్తులు అమ్మవారిని కొలుస్తారు.
నన్నూరులోని రాగమయూరి పార్క్, కొండారెడ్డి కమ్యూనిటీ హాల్‌లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ప్రార్థించారు. ఆయా గ్రామాల్లో శరన్నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.