ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి --మంత్రి పొంగులేటికి ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల జేఏసీ నాయకుల వినతి
--ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
--మంత్రి పొంగులేటికి ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల జేఏసీ నాయకుల వినతి
ఖమ్మం, సూర్య (మేజర్ న్యూస్): జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎం) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం జిల్లా ఎన్ హెచ్ ఎం
జేఏసీ నాయకులు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు . రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టడానికి గల కారణాలను ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు . రాష్ట్రంలో సుమారు 17,600 మంది ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నప్పటికీ , ఉద్యోగ భద్రత , వేతనాలు , వైద్య సదుపాయాలు , ఇతర సేవా ప్రయోజనాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు . ఉద్యోగ భద్రత కల్పించడం , సమాన పనికి సమాన వేతనం అమలు , మహిళలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు , ఈ హెచ్ ఎస్ ద్వారా నగదు రహిత వైద్యం , ప్రతి నెలా 5వ తేదీలోపు జీతాల చెల్లింపు వంటి డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు . అలాగే వార్షిక 5 శాతం ఇంక్రిమెంట్ , 8 శాతం లాయల్టీ బోనస్ , 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపు , రూ.20 లక్షల గ్రాట్యుటీ , ఉద్యోగి మరణిస్తే రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు అర్హులైన కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు . ఔట్‌సోర్సింగ్ విధానంపై పునఃపరిశీలన చేసి ఉద్యోగులను స్టేట్ హెల్త్ సొసైటీ పరిధిలో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు . గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నిరంతర ఆరోగ్య సేవలు అందిస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను మానవీయ దృక్పథంతో పరిశీలించి , న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించాలని నాయకులు కోరారు . ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం జేఏసీ నాయకులు డాక్టర్ మాధవి , రఘురామ్ , డాక్టర్ వెంకట్‌లాల్ , డాక్టర్ వి.వి.రావు , డాక్టర్ మనోజ్ , డాక్టర్ కాశయ్య తదితరులు పాల్గొన్నారు .