అభివృద్ధి, సంక్షేమమే ప్రచార అస్త్రాలుగా ముందుకు సాగుదాం ...
పర్చూరు, మేజర్‌న్యూస్ :జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల కార్యాచరణను పక్కాగా అమలు చేయాలని సూచించారు. అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై నాయకులతో సమీక్షించారు. నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ఓటరును కలవాలని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులంతా ఏకతాటిపైకి వచ్చి ఎన్నికలను సమష్టిగా ఎదుర్కోవాలని, అభ్యర్థుల విజయమే పరమావధిగా కృషి చేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు.