జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – రుద్రారంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన.
సంగారెడ్డి : జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు రుద్రారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెల్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి విద్యార్థులకు డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాలు తదితర సైబర్ నేరాల గురించి వివరించారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజల అవసరాలు, అత్యాశ, భయాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాలు, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో మోసాలు, లోన్ యాప్ మోసాలు, ఇతరుల పేరుతో మోసాలకు పాల్పడే ఇంపర్సనేషన్ మోసాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీ, పిన్ సీవీవీ , పాస్‌వర్డ్‌లు, యూపీఐ పిన్ వంటి రహస్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. బ్యాంకు అధికారులు లేదా పోలీసుల పేరుతో ఫోన్ చేసే వ్యక్తులను నమ్మి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను వెల్లడించవద్దని తెలిపారు. డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు నగదు సరైన వ్యక్తికి లేదా ఖాతాకు వెళ్తుందో నిర్ధారించుకున్న తర్వాతే లావాదేవీ పూర్తి చేయాలని సూచించారు.
భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. గుర్తుతెలియని వెబ్‌సైట్లు లేదా వ్యక్తులకు ముందస్తుగా నగదు చెల్లించకుండా, విశ్వసనీయమైన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.
తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్, క్రిప్టోకరెన్సీ, షేర్ మార్కెట్ ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత వ్యక్తులు, సంస్థల విశ్వసనీయతను పూర్తిగా పరిశీలించాలని, అధిక లాభాల ఆశతో తొందరపడి డబ్బులు పెట్టుబడి పెట్టవద్దని తెలిపారు.
పోలీసులు, సీబీఐ, కస్టమ్స్ లేదా ఇతర ప్రభుత్వ అధికారుల పేరుతో ఫోన్ లేదా వీడియో కాల్ చేసి, కేసులు, అరెస్టు లేదా చట్టపరమైన చర్యల పేరుతో భయపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మవద్దని సూచించారు. చట్టబద్ధమైన విచారణ పేరుతో వీడియో కాల్‌లోనే అరెస్టు చేసినట్లు బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతర విద్యార్థులకు కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. సకాలంలో ఫిర్యాదు చేయడం వల్ల మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశం ఉంటుందని వివరించారు.ఈ అవగాహన కార్యక్రమంలో సైబర్ సెల్ సిబ్బంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.