27 నుండి జిల్లా లో తుఫాన్ ప్రభావం ఎక్కువుగా ఉంది : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
బాపట్ల, మేజర్‌న్యూస్ : ఈనెల 27 నుండి జిల్లాలో రాబోయే తుఫానులో ఎలాంటి ఆస్తి,ప్రాణ నష్టం జరగకుండా అధికారులందరూ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.
ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్ బంగ్లా నుండి జిల్లా అధికారులతో ఈ నెల 27 నుండి జిల్లాలో రాబోవు తుఫాను వల్ల జిల్లాలో ఎలాంటి నష్టం జరగకుండా తీసుకోవలసిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ప్రధాన కార్యదర్శులతో ఈ నెల 27 నుండి రాష్ట్రంలో తీవ్రమైన తుఫాను రానున్న సందర్భంగా తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో తీర ప్రాంతమైన బీచ్లకు సమీపంలో ఉన్న గ్రామాలను మరియు కృష్ణా నది ఒడ్డున గ్రామాలు, కేనాల్ సమీపంలో ఉన్న గ్రామ ప్రజలను అప్రమత్తంగా చేయాలని ఆర్డీఓలను ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి చాపల వేటకు వెళ్లకుండా ముందుగానే వారికి తెలియజేయాలని, ఇప్పటికే సముద్రంలోనికి వెళ్లిన మత్స్యకారులను తిరిగి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయంలో పునరావసకేంద్రం ఏర్పాటు చేయడానికి, స్వయం సంఘ స్వయం సహాయక సంఘాల మహిళలు భోజనాలు చేయడానికి సంబంధిత అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎఫ్ పి షాపు లలో ఉన్న నిత్యావసర వస్తువులు తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. త్రాగునీరుకు సంబంధించి వాటర్ బాటిల్స్ వాటర్ పాకెట్స్ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తుఫాను వల్ల విద్యుత్ కు అంతరాయం కలిగితే వెంటనే మరమ్మతులు చేయడానికి పోల్స్, వైర్లు సిబ్బంది అందరిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్ ఈ ని ఆదేశించారు. జిల్లాలోనే చెరువుల నుండి నీటిని తొలగించడానికి జెసిబి లు సిద్ధంగా ఉంచుకోవాలని డ్రైన్ ఈ ఈని ఆదేశించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని ఏడి ఐ & పి ఆర్ ను ఆదేశించారు. ప్రెస్ మీట్ అనంతరం అన్ని శాఖల జిల్లా అధికారులతో తుఫానుకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు డిఆర్ఓ, ఆర్డీఓలు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.