ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమిద్దాం.. ఆయిల్‌పామ్ తోటలను కాపాడుకుందాం! - జిల్లా ఉద్యాన అధికారి గడ్డం శ్యాంప్రసాద్
సూర్య - పెద్దపల్లి : ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున ఆయిల్‌పామ్ రైతులు నీటి సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలని జిల్లా ఉద్యాన అధికారి గడ్డం శ్యాంప్రసాద్ సూచించారు.
గురువారం గట్టుసింగారంలో దుగ్గెంపూడి కమలస్కార్‌రెడ్డికి చెందిన ఆయిల్‌పామ్ తోటను సందర్శించి పంట పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్‌లో మెరుగైన దిగుబడుల కోసం నిరంతర నీటి లభ్యత, సమతుల్య పోషక యాజమాన్యం అవసరమన్నారు. డ్రిప్ ఇరిగేషన్‌తో నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, మల్చింగ్ ద్వారా నేలలో తేమను కాపాడుకోవాలని సూచించారు. వర్షపు నీటి సంరక్షణకు వ్యవసాయ కుంటలను వినియోగించుకోవాలని, కొత్తగా సాగు చేపట్టే రైతులు ముందుగానే నీటి వనరులను నిర్ధారించుకోవాలని తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, డ్రిప్ పరికరాలు, యాంత్రీకరణ సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తిరుమల ఆయిల్ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కేషు కళ్యాణ్కర్, విస్తరణ అధికారి రాము, ఫీల్డ్ ఆఫీసర్ అరవింద్, జైన్ డ్రిప్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.