బంగారు, వెండి ఆభరణాల చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హౌసింగ్ బోర్డు, లైన్ నంబర్ 02లో ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేసిన కేసును మావల పోలీసులు ఛేదించి నిందితుడిని గుర్తించారు.వివరాల్లోకి వెళితే.. న్యూ హౌసింగ్ బోర్డు, లైన్ నంబర్ 02కు చెందిన కల్లెం గణేష్ రెడ్డి ఈ నెల 29వ తేదీ రాత్రి ఇంటికి తాళం వేసి రిమ్స్ ఆసుపత్రిలో విధులకు వెళ్లాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చి చూడగా ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించాడు. ఇంట్లోని బీరువా తాళం కూడా తెరిచి ఉండటంతో పరిశీలించగా, అందులో ఉంచిన వెండి గిన్నె, వెండి గ్లాసుతో పాటు బంగారు ఉంగరాలు కనిపించలేదు. దీంతో బాధితుడు మావల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాల మొత్తం విలువ సుమారు రూ.27,500.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, చోరీకి పాల్పడిన ఆదిలాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన సమీర్ ఖాన్ (28)ను నిందితుడిగా గుర్తించారు.నిందితుడు సమీర్ ఖాన్‌పై మావల, ఆదిలాబాద్ టూ టౌన్, ఆదిలాబాద్ వన్ టౌన్, తాంసి, గుడిహత్నూర్, జైనథ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో పలు కేసులు నమోదయ్యాయి. ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడిన కేసులతో పాటు ఇతర నేరాలకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 19 కేసుల్లో అతని ప్రమేయం ఉన్నట్లు పోలీసు రికార్డుల ద్వారా తెలుస్తోంది.ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, విలువైన బంగారు, వెండి ఆభరణాలను భద్రంగా ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.