ఎల్ నినో దృష్ట్యా విద్యుత్తును పొదుపు చేయండి...
#. చిన్న చిన్న చిట్కాల ద్వారా విద్యుత్తు వృధాను అరికట్టండి.
#. విద్యుత్ ఆదాపై విద్యార్థులకు పెద్ద ఎత్తున అవగాహన--- జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ .
నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్... ఎల్ నినో పరిస్థితిలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు విద్యుత్తును ఆదా చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా రెడ్ కో ఆధ్వర్యంలో “సేవ్ ఎనర్జీ” పేరున ఈనెల 1 నుండి 7 వరకు వారం రోజుల పాటు నిర్వహించనున్న" సేవ్ ఎనర్జీ" కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న చర్యలను జిల్లా కలెక్టర్ వివరించారు. “ సేవ్ ఎనర్జీ” కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ప్రజలు అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని, ముఖ్యంగా చిన్న చిన్న చిట్కాల ద్వారా విద్యుత్ ను ఎలా ఆదా చేసుకోవాలో చెప్పాలని, సోలార్ ఎనర్జీని వాడడం, ఈ- వేస్టేజ్ తదితర అంశాలపై జిల్లా అధికారులకు వివరించారు. జిల్లా , మండల, గ్రామస్థాయి వరకు అధికారులు, సిబ్బంది ఇకపై ప్రతిరోజు ఉదయం 10.30 గంటల నుండి 11:30 వరకు అన్ని కార్యాలయాలలో సూర్యరశ్మి ఎక్కువగా ఉన్నచోట లైట్లు ,ఫ్యాన్లు వేసుకోవద్దని, ఎయిర్ కండిషన్ ను 25 డిగ్రీలకు మించి పెట్టుకోకూడదని, విద్యుత్ ఆదా పద్ధతులను కింది స్థాయి వరకు తెలియజేయాలని, జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులను ఒకచోట సమావేశపరిచి విద్యుత్ ను ఎలా ఆదా చేయాలనే దానిపై చిన్న చిన్న చిట్కాలను తెలియజేయాలని చెప్పారు. అవసరమైతే పిల్లల వర్క్ డైరీలో వీటన్నిటిని నమోదు చేయాలని, తద్వారా తల్లిదండ్రులు అదే పాటిస్తారన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, జన సమ్మర్థం ఎక్కువగా ఉన్నచోట విద్యుత్తు పొదుపుపై ఫ్లెక్సీలు, స్టాండీలు ఏర్పాటు చేయాలని చెప్పారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన జిల్లా అధికారులచేత "విద్యుత్తును పొదుపు చేస్తానని" ప్రతిజ్ఞ చేయించారు.నవంబర్ 1 నుండి 15 వరకు బిర్సా ముండ 151 వ జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, జన జాతీయ గౌరవ దివస్ ఉత్సవాల పేరిట 15 వరకు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు . ముఖ్యంగా గిరిజనులకు సంబంధించిన పథకాలు, చరిత్ర, చిత్రలేఖన, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు ,వర్క్ షాప్ ల నిర్వహణ, ఎగ్జిబిషన్లు, క్విజ్ కాంపిటీషన్స్ తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.అనంతరం జిల్లా అధికారులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షిస్తూ 30 రోజులకు మించి పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులన్నీ ఈ వారంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో 391, మండల స్థాయిలో 359 ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్ లోఉన్నాయని, ఫిర్యాదులు ఎక్కువగా ఉన్న శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ప్రజావాణిపై ఈ నెల మధ్యలో ప్రత్యేకంగా సమీక్షించనున్నట్లు వెల్లడించారు. అర్ణబ్ తుఫాన్ వల్ల జిల్లాలో కొన్ని ప్రాంతంలో వర్షం కురిసిందని, అలాగే రానున్న మాతో తుఫాను వల్ల మూడు, నాలుగు రోజుల్లో కురిసే వర్షపు నీటిని తప్పనిసరిగా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా ఈ వారం మొత్తం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో సోక్ పిట్ల నిర్మాణం చేపట్టాలని తెలిపారు.ప్రభుత్వం నిర్వహిస్తున్న భూ రీ- సర్వేలో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వారికి సంబంధించిన ఆస్తులను తప్పనిసరిగా ఎన్యుమరేషన్ చేయించుకోని ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు.పెన్షన్ పొందే పెన్షన్ దారుడు చనిపోతే వెంటనే భార్య కు పెన్షన్ వచ్చే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఇందుకు సంబంధించి ఎవరైనా అర్హులు ఉంటే డిఆర్డిఓ తో సంప్రదించి దరఖాస్తు చేసుకునేలా చూడాలని తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్భంగా జనజాతీయ గౌరవ దివస్ సెలబ్రేషన్స్ పై రూపొందించిన గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిటిడిఓ కమలాకర్ రెడ్డి ,రెడ్కో ప్రతినిధి అశోక్, తదితరులు హాజరయ్యారు.