వర్షాలనూ లెక్కచేయని ప్రచార హోరు!
బాడంగి, సూర్య : మండలంలో ఎన్నికల ప్రచారం రోజురోజుకూ ఊపందుకుంటోంది. తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నప్పటికీ రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాలకు ఏమాత్రం విరామం లేకుండా కొనసాగుతున్నాయి. మండలంలోని 25 గ్రామ పంచాయతీల పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వర్షాలను సైతం లెక్కచేయకుండా అభ్యర్థులు, పార్టీ శ్రేణులు గ్రామాల్లో పర్యటిస్తూ తమకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 31 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జడ్పీటీసీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మండలంలో ప్రధానంగా రెండు ప్రధానమైన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ నెలకొన్నట్లు రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి!.ఇదిలా ఉండగా, కొన్ని ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థుల మధ్య రాజకీయ సమీకరణాలపై స్థానికంగా పలు చర్చలు సాగుతున్నాయి. అయితే ఈ విషయాలపై ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.మరోవైపు ప్రచార గడువు ముగిసే సమయానికి రాజకీయ పార్టీల వ్యూహాలు, అభ్యర్థుల ప్రచార సరళి, ఓటర్ల స్పందన ఏ విధంగా ఉండనున్నాయన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చివరకు ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారో తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.