telangana
డ్రగ్స్ తయారీ, సరఫరాదారులపై ఉక్కుపాదం మోపాలి - కలెక్టర్ చిత్రా మిశ్రా
సూర్య కరీంనగర్ ప్రతినిధి : డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగంతో యువత జీవితాలు నాశనమవుతున్నాయని, వాటి తయారీ, సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీలో నిర్వహించిన జిల్లాస్థాయి నార్కోటిక్స్ నియంత్రణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, విద్యాసంస్థలు, హాస్టళ్లు, మెడికల్, పాన్ షాపులపై నిరంతర నిఘా ఉంచి సంయుక్త తనిఖీలు చేపట్టాలన్నారు. గంజాయి చాక్లెట్లు, ఇతర తినుబండారాల విషయంలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. మత్తుకు బానిసైన వారిని నేరస్తులుగా చూడకుండా చికిత్స, కౌన్సెలింగ్ అందించాలని స్పష్టం చేశారు. సమావేశంలో సీపీ గౌస్ ఆలం, డీఆర్ఓ స్వామి, డీసీపీఓ పర్వీన్, ఇన్‌చార్జి డీఈఓ తిరుపతిరావు, టాస్క్‌ఫోర్స్ సీఐ దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు. గత నెలలో 10 విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 570 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.