*డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె..!* -- *ప్రజావాణిలో కలెక్టర్‌కు సమ్మె నోటీసు*
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (నవంబరు 16):
తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు సమ్మె నోటీసు అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు ఎం. రేవతి కళ్యాణి, కె. మహాలక్ష్మి మాట్లాడుతూ,.. 20 ఏళ్లుగా ప్రజారోగ్య పరిరక్షణకు సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు ప్రస్తుతం రూ.9,900 మాత్రమే పారితోషికం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు రూ.18 వేల కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్‌ఐ, బీమా, పెన్షన్, పదోన్నతులు, సెలవుల సౌకర్యాలు కల్పించాలని కోరారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ. అశోక్, బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్. ప్రభాకర్ మాట్లాడుతూ,.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు డి. అనిత, పద్మ, లలిత, సబియా, వసంత, కోమలత, యాదమ్మ, ప్రవీణ, దేవిక, సీఐటీయూ నాయకులు ఎన్. శ్రీనివాస్, లింగస్వామి, ఐ. రాజశేఖర్, ఎం. నరేష్ తదితరులు పాల్గొన్నారు.