దసరా సెలవులను అమలు చేయాలి : ఎన్‌ఎస్‌యుఐ
ఎన్‌ఎస్‌యుఐ చేవెళ్ల మండల అధ్యక్షుడు ఎండీ సమీరుద్దీన్
చేవెళ్ల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ప్రకటించిన దసరా సెలవులను అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా అమలు చేయాలని ఎన్‌ఎస్‌యుఐ చేవెళ్ల మండల అధ్యక్షుడు ఎండీ సమీరుద్దీన్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ, దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించేందుకు ప్రయత్నించే విద్యాసంస్థలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకునే హక్కు ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ఎన్‌ఎస్‌యుఐ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
(చేవెళ్ల - మేజర్ న్యూస్)