చిరుత సంచారంతో గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్న అటవి శాఖ అధికారులు.
సూర్య, నాగిరెడ్డి పేట్, నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద గ్రామ శివారులోని చెన్నకేశవ స్వామి గుట్ట వద్ద బుదవారం సాయంత్రం చిరుత పులి సంచరించడంతో మండల అటవి శాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. గ్రామ శివారులో చిరుత పులి సంచరిస్తున్న సంచారంతో స్థానిక ఫారెస్ట్ రేంజ్ అధికారి వాసుదేవ్ బుధవారం రాత్రి తమ సిబ్బందితో కలిసి మాల్తుమ్మెద గ్రామానికి వెళ్ళారు. గ్రామ శివారులో చిరుత పులి సంచరించడంతో భయ భ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ వారికి పలు సూచనలిచ్చారు.చిరుతపులి కనిపించినప్పుడు దాని దగ్గరకు ఎవరూ వెళ్లొద్దని ,గుంపులుగా చేరి చూడటానికి ప్రయత్నించొద్దని,చిరుతపులిపై రాళ్లు విసరడం, కేకలు వేయడం, లేదా దానిని తరమడం చేయోద్దని, పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దన్నారు. ఉదయంపూట, సాయంత్రం ,రాత్రి వేళల్లో జాగ్రత్తగా ఉండాలని , రాత్రి వేళల్లో ఒంటరిగా రైతులు పంట పొలాలకు వెళ్లొద్దని కోరారు. తమ పశువులను రాత్రిపూట సురక్షితమైన ప్రాంతంలోని కొట్టాల్లో ఉంచాలని కోరారు.తిరిగి గ్రామ శివారులో చిరుత పులి కనిపిస్తే వెంటనే అటవి శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.ఆయన వెంట డిప్యూటీ రేంజ్ అధికారి రాఘవేంద్ర రావు, సిబ్బంది ఉన్నారు.