చిన్నారుల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి శిశుగృహలో మెరుగైన వసతులు కల్పించాలి.. కలెక్టర్ కోయ శ్రీహర్ష
సూర్య పెద్దపల్లి ప్రతినిధి
సంరక్షణ అవసరమైన చిన్నారుల భద్రత, ఆరోగ్యం, సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం సుల్తానాబాద్‌లోని బాలసదన్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శిశుగృహాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రుల సంరక్షణకు నోచుకోని, అనాథ, వదిలివేయబడిన చిన్నారులకు సురక్షిత ఆశ్రయం కల్పించడమే శిశుగృహ లక్ష్యమన్నారు. ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రేమపూర్వక సంరక్షణ, నాణ్యమైన పోషకాహారం, వైద్య సదుపాయాలు అందించాలని సూచించారు. చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తూ, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేలా అర్హులైన వారికి చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ ద్వారా కుటుంబ వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ రమేష్, సీడీపీఓ అనిత, సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, జిల్లా బాలల సంరక్షణ అధికారి జితేందర్, బాలసదన్ సిబ్బంది పాల్గొన్నారు.