telangana
బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో చోరీ, నిలిచిన ఇంటర్నెట్ సేవలు
సూర్య, జన్నారం : జన్నారం మండల కేంద్రంలో గల బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కార్యాలయంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దొంగలు చొరబడి కాపర్ వైర్ తో పాటు బ్యాటరీలు, ఇతర పరికరాలను ఎత్తుకెళ్లారు. దీంతో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలు శనివారం పొద్దంతా నిలిచిపోయాయి. అదేవిధంగా మండలంలోని కవ్వాల్, కలమడుగు బిఎస్ఎన్ఎల్ సెల్ఫోన్ టవర్లు పని చేయకపోవడంతో వినియోగదారులు రకరకాల ఇబ్బందులకు గురయ్యారు. చోరీకి గురైన వస్తువుల విలువ సుమారు 50 వేల వరకు ఉంటుందని బిఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న బిఎస్ఎన్ఎల్ డిఈ దాసరి శ్రీనివాస్, లక్షెట్టిపేట జీటీవో కొత్త రాజేష్, కార్యాలయంలో పనిచేసే పలువురు ఉద్యోగులు కార్యాలయంకు చేరుకుని నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవల పనులు చేపట్టడంలో నిమగ్నమయ్యారు. చోరీ జరిగినట్లు స్థానిక అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాన్ని ఎస్ఐ ఉదయ్ కిరణ్ సందర్శించారు. దొంగతనానికి పాల్పడింది ఎవరో విచారణ జరుపుతామని తెలిపారు.