telangana
బతుకమ్మ వేడుకలు ముగిసినా.. అందని చీరలు!
సూర్య, పెంచికల్‌పేట్: తెలంగాణ ఆడపడుచులు ఎంతో వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ముగింపు వేడుకైన సద్దుల బతుకమ్మ ఆదివారం ఘనంగా జరిగినా.. పెంచికల్‌పేట్ మండలంలోని మహిళలకు మాత్రం బతుకమ్మ చీరలు అందలేదు. పండుగకు చీరలు వస్తాయని ఆశగా ఎదురుచూసిన మహిళలకు నిరాశే మిగిలింది. పూల పండుగ ముగిసినా చీరల పంపిణీపై స్పష్టత లేకపోవడంతో మహిళల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
- పండుగ ముగిసినా కానరాని పంపిణీ.…బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు అందించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. పండుగ ప్రారంభానికి ముందే చీరలు అందుతాయని ఆశించిన మహిళలు, సద్దుల బతుకమ్మ రోజైనా పంపిణీ జరుగుతుందని భావించారు. అయితే ఆదివారం పండుగ వేడుకలు ముగిసినా చీరలు అందకపోవడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. పండుగ సమయంలో కొత్త చీరలు ధరించి వేడుకల్లో పాల్గొనాలన్న మహిళల ఆకాంక్ష నెరవేరలేదు.
- అధికారుల స్పందన కోసం ఎదురుచూపులు.…మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ ఎప్పుడు చేపడతారనే దానిపై స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. చీరల పంపిణీపై సంబంధిత అధికారులు వివరాలు వెల్లడించాలని మహిళలు కోరుతున్నారు. ప్రభుత్వం అందించే చీరలు అర్హులైన మహిళలకు వీలైనంత త్వరగా పంపిణీ చేసి, నిరీక్షణకు తెరదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.