బషీరాబాద్ లో మాజీ ఎంపీటీసీ ఇంట దసరా సంబరాలు
బషీరాబాద్, మేజర్ న్యూస్:మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ రేఖా పవన్ ఠాకూర్ ఇంట్లో దసరా పండుగను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, చిన్నారులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు.నైవేద్యానికి నవధాన్యాలైన బియ్యం, గోధుమలు, పెసలు, మినుములు, శనగలు, కందులు, నువ్వులు, ఉలవలు, అలసందలతో పాటు పండ్లు, పాయసం, పులిహోర, చక్కెర పొంగలి వంటి ఆహార ధాన్యాలను అమ్మవారికి నివేదించారు. ప్రకృతి ప్రసాదించిన ప్రతి గింజకు కృతజ్ఞత తెలపడమే ఈ నైవేద్యం వెనుక పరమార్థమని కుటుంబ సభ్యులు తెలిపారు.నవరాత్రుల్లో నవధాన్యాలకు ఎంతో విశిష్టత ఉందని, ఈ ధాన్యాలు నవగ్రహాలకు ప్రతీకలని పండితులు చెబుతారు. వీటిని పూజించడం వల్ల ధన, ధాన్య, ఆరోగ్య, సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని, చెడు తొలగి మంచి కలుగుతుందని నమ్మకం. అందుకే దసరా నాడు ధాన్యాలను పూజించడం ఆనవాయితీగా వస్తోంది.ఈ పండుగ రైతు పండుగకు కూడా ప్రతీక. పంటలు చేతికొచ్చిన వేళ రైతు తన ఇంట్లో పండిన కొత్త ధాన్యాన్ని ముందుగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి, తర్వాత తాము స్వీకరించడం మన సంస్కృతి. రేఖా పవన్ ఠాకూర్ కుటుంబం కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఘనంగా దసరాను జరుపుకోవడం విశేషం.