నాగర్ కర్నూల్ లో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల నిరసన లో తల్లులకు తోడుగా కూతుళ్లు
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు చేపట్టిన దీక్షలో చిన్నారుల సైతం పాల్గొనడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. గత ఏడు రోజులుగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. ఉద్యోగులు కొనసాగిస్తున్న దీక్షలో రోజుకొక వినూత్న కార్యక్రమంతో ప్రభుత్వ పెద్దలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తల్లులతో పాటు వారి వారి చిన్నారులు దీక్షాశివరానికి ఉదయాన్నే వచ్చి నిరసన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఉద్యోగులు ఏ కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నారో అవే కార్యక్రమాల్లో చిన్నారులు పాలుపంచుకుంటూ వృత్తిరీత్యా ఎదుర్కొంటున్న వారి సమస్యలను నిశితంగా గమనిస్తూ వారికి బాసటగా నిలవడం అందరిని కట్టిపడేస్తుంది. పిల్లలు సైతం నినాదాలు ఇవ్వడం, పనిచేస్తున్న అమ్మ నాన్నలకు రెగ్యులరైజ్ కావాలని, సంఘటితంగా పోరాడాలని, ప్రభుత్వాలు దిగివచ్చి కష్టాలు తీర్చాలని వేడుకుంటూ నినాదాలు చేయడం మాటలు సైతం మాట్లాడడం పలువురుని ఆకర్షించింది. కుటుంబంలో తమ తల్లిదండ్రులు చాలీచాలని జీతాలతో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన చిన్నారులు ఇలా శిబిరాలకు వచ్చి తమ ఆవేదనను వెలబుచ్చుతూ న్యాయం జరగాలని కోరుకోవడం, చిన్నారులు ఒక దశలో కన్నీటి పర్యంతమవడం శిబిరంలో కనిపించింది. ఏది ఏమైనప్పటికీ చిన్నారుల ఆందోళన, ఆవేదనకు ప్రభుత్వం దిగివచ్చి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.
పి.వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్