అతిథి అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి
పాలామూరు మేజర్ న్యూస్ -
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డిగ్రీ అతిథి అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్) సెమినార్ హాల్‌లో ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీజీసీజీటీ ఎ , టీసీఈ -జే ఎ సి చైర్మన్ డాక్టర్ కె. సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 23 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు చెందిన సుమారు 300 మంది అతిథి అధ్యాపకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథి అధ్యాపకులు తమ దీర్ఘకాలిక సమస్యలను ముఖ్య అతిథి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సంవత్సరం నిర్వహించే డెమో, ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చేసి, ఇప్పటికే పనిచేస్తున్న అనుభవజ్ఞులైన అతిథి అధ్యాపకులనే కొనసాగించాలని, కన్సాలిడేటెడ్ పే విధానాన్ని అమలు చేయడంతో పాటు నెలవారీ వేతనాన్ని రూ.50,000లకు పెంచాలని కోరారు. అతిథి అధ్యాపకుల డిమాండ్లపై డాక్టర్ కె. సురేందర్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. డాక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ,కన్సాలిడేటెడ్ పే, ఆటో రెన్యువల్ , డెమో లేని విధానం, హెల్త్ ఇన్సూరెన్స్,సాధారణ సెలవులు, వేతనాల పెంపు వంటి అంశాలపై ప్రభుత్వంతో చర్చించి, వీలైనంత త్వరగా పరిష్కారం లభించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అతిథి అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి న్యాయమైన డిమాండ్ల సాధనకు తన వంతు కృషి తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డా. జి. శ్రీనివాస్ (జే ఎ సి జనరల్ సెక్రటరీ), ఏ. నాగరాజు (జాక్ అడిషనల్ సెక్రటరీ), మహమ్మద్ సులేమాన్ (జాక్ కో-చైర్మన్), డా. జి. సత్యనారాయణ గౌడ్, డా. టి. నర్సింహులు, డా. కె. తిరుపతయ్య, సతీష్ రెడ్డి, వెంకటస్వామి (వనపర్తి), ప్రభాకర్ (నారాయణపేట), దశరథ్ (నాగర్‌కర్నూల్) మరియు ఎంవీఎస్ అతిథి అధ్యాపకుల బృందం తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ ఆత్మీయ సమ్మేళనం అతిథి అధ్యాపకుల ఐక్యతను, వారి హక్కులు మరియు సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పింది.
ఎం.ఓం ప్రకాష్,మహబూబ్ నగర్ ..