అల్ఫోర్స్ డాక్టర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
సూర్య కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని స్థానిక కొత్తపల్లిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వీఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ నరేందర్ రెడ్డి భారీ కేక్ కట్ చేసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర అత్యున్నత పదవిని అధిరోహించిన నాయకుడు రేవంత్ రెడ్డి అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. మంత్రులతో సమన్వయం చేసుకుంటూ పాలనను ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.
ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశంసించారు. యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, విద్యారంగంలో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.
అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి జిందాబాద్, ఆయన నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో కార్యక్రమ ప్రాంగణం మార్మోగింది.
ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, టీమ్ వీఎన్ఆర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.