అధికార పార్టీ నాయకుల అండదండలపై ఆరోపణలు
కొండాపూర్;కొండాపూర్ మండలంలో అనుమతుల మాటున అక్రమ మైనింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గొల్లపల్లి, గుంతపల్లి, తొగర్‌పల్లి, కొండాపూర్, తెర్పొల్ మునిదేవునిపల్లి గ్రామాల రెవెన్యూ పరిధిలోని చెరువులు, కుంటలు, అసైన్డ్ భూములు, గుట్టల వద్ద నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకచోట అనుమతులు తీసుకుని మరోచోట తవ్వకాలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.మరోవైపు పంట పొలాలు, నివాస ప్రాంతాల సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో బోర్లు వేస్తున్నట్లు సమాచారం. అక్రమ తవ్వకాలు, బోర్లపై అధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడు రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతున్నాయనే ప్రచారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కొన్ని చోట్ల బోర్లు సీజ్ చేసినప్పటికీ తిరిగి మోటార్లు ఏర్పాటు చేసి వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.భారీ టిప్పర్లు, ట్రక్కుల ద్వారా రాత్రివేళల్లో మట్టి తరలిస్తుండటంతో గ్రామీణ రహదారులపై దుమ్ము, ధూళి సమస్యతో పాటు ప్రమాదాల ముప్పు పెరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాల ప్రాంతాల్లో చెట్ల తొలగింపు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు, రవాణా పర్మిట్లు, తవ్వకాల పరిమితులపై సమగ్ర పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి బోర్ల తవ్వకాలు, మట్టి తవ్వకాలకు సంబంధించిన అనుమతులను పరిశీలించాలని, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సహజ వనరుల పరిరక్షణకు రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో తనిఖీలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.