*5317 మందికి కొత్త చేయూత పింఛన్ల పంపిణీ*
*రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన , క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
మధిర, సూర్య మేజర్ న్యూస్
వృద్ధాప్య దివ్యంగత్వం ఇతర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు పింఛన్లు కొండంత అండగా నిలుస్తున్నాయి.మధిర నియోజకవర్గంలో మరో 5317 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేయడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. బుధవారం స్థానిక రెడ్డి గార్డెన్స్‌లో నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అర్హులైన నిరుపేదలకు పింఛన్లు అందించడం ద్వారా వారి జీవనానికి ఆర్థిక చేయూత లభిస్తుందని తెలిపారు. నియోజకవర్గం లో గతంలో 37,477 పెన్షన్ లబ్ధిదారులు ఉండగా నూతనంగా 5,317 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు కాగా మొత్తం పింఛన్ల సంఖ్య 42,794కు చేరిందని వెల్లడించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ పేదలకు అందించే సంక్షేమ పథకాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాజీపడటం లేదన్నారు.రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే మహత్తర లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి శ్రీహరి తెలిపారు.అందుకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు రుణాలు, ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతో మంజూరు చేయడం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు.వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగం సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదన్నారు.వచ్చే వర్షాకాలం వరకు ప్రజలకు అవసరమైన సన్నబియ్యం నిల్వలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, పంపిణీ నిరంతరాయంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.సోనియా గాంధీపై కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన పూర్తిగా ఖండించారు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ పాత్రను ప్రశ్నించే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి శాసనసభలో సోనియా గాంధీ ధైర్యం చేయకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.
అలాంటి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఇప్పుడు సోనియా గాంధీ పుస్తకంలో తెలంగాణ ప్రస్తావన లేదంటూ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సోనియా గాంధీని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు.మధిర అభివృద్ధితోపాటు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిరంతర కృషిని మంత్రి శ్రీహరి ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఇంచార్జ్ డీఆర్డీవో శిరీష, జిల్లా పశు సంవర్థక అధికారి డా. పురందర, జిల్లా మత్స్య శాఖ అధికారి మల్లేశం, జిల్లా క్రీడల అధికారి టి. సునీల్ కుమార్, మధిర మున్సిపల్ చైర్ పర్సన్ సాధినేని సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నర్సింహా రావు, మత్కేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, మధిర మున్సిపల్ కమిషనర్ సామ్యూల్, నియోజకవర్గ ఎంపిడిఓ లు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.