గణేష్ నిమజ్జనం: మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్!
సెప్టెంబర్ 25 ఉదయం 6 నుంచి 26 సాయంత్రం 6 గంటల వరకు
ఆదేశాల అమలుపై కఠిన నిఘా.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
మేడ్చల్ జిల్లా ప్రతినిధి,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 22): గణేష్ విగ్రహాల తుది నిమజ్జన వేడుకలను అత్యంత ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కమిషనరేట్ పరిధిలోని అన్ని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు అలాగే కల్లు దుకాణాలను తాత్కాలికంగా పూర్తిగా మూసివేయాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ బంద్ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా సంబంధిత ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు డీటీఎఫ్ సిబ్బంది తమ పరిధిలోని ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లఘించి ఎవరైనా దుకాణాలు తెరిచి కార్యకలాపాలు నిర్వహిస్తే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఈ ఉత్తర్వులు అమల్లో ఉండే కాలంలో ఎలాంటి ఈవెంట్ అనుమతులను కూడా జారీ చేయరాదని అధికారులు స్పష్టం చేశారు. సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండి నిబంధనల అమలులో ఎక్కడా నిర్లక్ష్యానికి తావివ్వరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు.
గణేష్ నిమజ్జన వేడుకలు విజయవంతంగా ముగిసేందుకు ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు అందరూ అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రభుత్వం, పోలీసు మరియు ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని సూచించారు. నగరంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లతో పాటు ముందస్తు భద్రతా చర్యలను చేపట్టింది.