ఎంపిక పూర్తయింది.. నియామక పత్రాలు ఆలస్యం చేయొద్దు: గద్వాల్ విజయలక్ష్మి
ఆర్టీసీ సూపర్‌వైజర్ పోస్టులకు ఎంపికైన 186 మందికి నియామక పత్రాల ప్రక్రియ వేగవంతం చేయాలని సూచన
హైదరాబాద్: ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన 186 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు త్వరగా అందేలా ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్‌పర్సన్, సీఎం ప్రజావాణి రాష్ట్రస్థాయి ఇన్‌చార్జి గద్వాల్ విజయలక్ష్మి అధికారులను కోరారు.
మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన 257వ సీఎం ప్రజావాణి కార్యక్రమానికి టీఎస్‌టీ, ఎంఎస్‌టీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యను గద్వాల్ విజయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. ఎంపిక ప్రక్రియ పూర్తై, ఫలితాలు మే నెలలోనే వెలువడినప్పటికీ ఇప్పటివరకు నియామక ఉత్తర్వులు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో కొందరు ఇతర ప్రైవేటు ఉద్యోగ అవకాశాలను సైతం వదులుకున్నామని, నియామక ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని అభ్యర్థులు తెలిపారు.
అభ్యర్థుల విజ్ఞప్తిపై స్పందించిన గద్వాల్ విజయలక్ష్మి, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస్ రావుతో ఫోన్‌లో మాట్లాడి నియామక ప్రక్రియపై చర్చించారు. ఎంపికైన అభ్యర్థులు మరింతకాలం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా మిగిలిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి వారం రోజుల్లో నియామక పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నోటిఫికేషన్ నంబర్ 369/Rectt/Rect.2/2025 ప్రకారం చేపట్టిన టీఎస్‌టీ, ఎంఎస్‌టీ నియామకాలకు సంబంధించి పరిపాలనా పరంగా సాధ్యమైన మేరకు ఈ పోస్టుల ప్రక్రియను ఇతర కేడర్ల అంశాలతో ముడిపెట్టకుండా విడిగా పూర్తి చేయాలని ఆమె కోరారు.
“ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు కేవలం ఉద్యోగ పత్రాలు మాత్రమే కాదు. వారి కుటుంబాల జీవనోపాధి, ఆర్థిక భద్రతతో ముడిపడి ఉన్న అంశం. అందుకే ఈ సమస్యను మానవతా దృక్పథంతో, త్వరితగతిన పరిష్కరించాలి” అని గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు.
తమ సమస్యను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి చొరవ చూపిన గద్వాల్ విజయలక్ష్మికి ఎంపికైన అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు.