ఫ్రాన్స్‌లో ఫ్రాన్సిస్ మార్గంలో పోప్ లియో పర్యటన
లైంగిక వేధింపుల బాధితులకు న్యాయం మరియు చర్చి సంస్కరణలపై దృష్టి
సూర్య అంతర్జాతీయ డెస్క్: క్యాథలిక్ చర్చిలో దశాబ్దాలుగా చోటుచేసుకున్న లైంగిక వేధింపుల వ్యవహారంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఫ్రాన్స్‌లో పర్యటించనున్న పోప్ లియో XIV పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పవిత్ర నగరమైన లూర్ద్‌తో పాటు పారిస్, మెట్జ్ నగరాల్లో పోప్ పర్యటించనుండగా, లైంగిక దాడుల బాధితులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. దశాబ్దాలుగా చర్చి వర్గాల నుండి అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేకూర్చడంతో పాటు వ్యవస్థాగత సంస్కరణలు వేగవంతం కావాలని బాధితుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
గతంలో వెలువడిన ఒక సమగ్ర నివేదిక ప్రకారం ఫ్రాన్స్‌లోని చర్చిల పరిధిలో వేలాది మంది చిన్నారులు లైంగిక వేధింపులకు గురైనట్లు తేలడం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ బిషప్‌ల యంత్రాంగం నష్టపరిహారం చెల్లింపులు మరియు రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ, పూర్తిస్థాయి బాధ్యతాయుతమైన విధానాలు అమలులోకి రావాల్సి ఉందని బాధితులు భావిస్తున్నారు. పోప్ లియో స్వయంగా బాధితుల మాటలను విని చర్చి అంతర్గత చట్టాల్లో మార్పులు తీసుకురావడానికి ఈ సమావేశం దోహదపడుతుందని ఆశిస్తున్నారు.
పారిస్ పర్యటన సందర్భంగా ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో భేటీ కానున్న పోప్, యునెస్కో ప్రధాన కార్యాలయంలో కూడా ప్రసంగించనున్నారు. అదేవిధంగా పునర్నిర్మించిన నోట్రే-డామ్ క్యాథడ్రల్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. చర్చి విశ్వసనీయత తీవ్రంగా దెబ్బతిన్న ప్రస్తుత పరిస్థితులలో, పారదర్శకతను పెంచడం మరియు పిల్లల రక్షణకు కఠిన నిబంధనలు అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా పోప్ అడుగులు వేస్తున్నట్లు వాతాకన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ పర్యటన ద్వారా ఫ్రాన్స్‌లోని క్యాథలిక్ సమాజంలో నూతన విశ్వాసం నింపడంతో పాటు బాధితులకు సాంత్వన చేకూర్చే చర్యలకు శ్రీకారం చుట్టనున్నారని భావిస్తున్నారు. యూరప్‌లోని పురాతన చర్చి వ్యవస్థల్లో మార్పులు తీసుకురావడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా చర్చి నియమావళిలో విప్లవాత్మక సంస్కరణలు సాధ్యమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.