కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ రంగానికి తీరని నష్టం
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ ధ్వజం
గాజువాక, సెప్టెంబర్ 22, మేజర్ న్యూస్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ విమర్శించారు. విశాఖ స్టీల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) సర్వసభ్య సమావేశం ఉక్కునగరంలోని ఆంధ్రకేసరి కళాక్షేత్రం (సీడబ్ల్యూసీ-2)లో మంగళవారం జరిగింది. తొలుత ఆయన యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తూ, ప్రైవేటీకరణ వైపు నెడుతోందని మండిపడ్డారు. కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను పరిమితం చేస్తూ, 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్‌లుగా మార్చడం దుర్మార్గమని ఆక్షేపించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడుకోవడంతో పాటు ఉద్యోగ భద్రత, కార్మిక హక్కుల సాధన కోసం కార్మిక వర్గమంతా విభేదాలు వీడి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జే.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ, విశాఖ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు జీఎస్‌జే అచ్యుతరావు, కసిరెడ్డి సత్యనారాయణ, నాయకులు బి.వెంకటరావు, ఎం.ఎ.మాధవరావు, పడాల రమణ, డొక్కా నర్సింగరావు, ఏ.మసేన్‌రావు, ఎన్.మిశ్రా, జి.బోసుబాబు, చీకటి అప్పారావు, నందికి తాతారావు తదితరులు పాల్గొన్నారు.