మహిళా అభివృద్ధికి మోదీ ప్రభుత్వం పెద్దపీట
మహిళా రైతులు, పారిశ్రామికవేత్తలకు మాధవ్ అభినందనలు…
విశాఖపట్నం, సెప్టెంబర్ 22,మేజర్ న్యూస్ :
గాదెరాజ్ ప్యాలెస్‌లో భారతీయ కిసాన్ మోర్చా, ఆంధ్రప్రదేశ్ మరియు గ్రామీణ ప్రాంత రైతుల సహకార సంఘం (ఎంఏసీఎస్) ఆధ్వర్యంలో
మహిళా సాధికారత, వ్యవసాయాభివృద్ధి, స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో “మన వ్యవసాయం – మన ఆహారం – మన ఆరోగ్యం” అనే సందేశంతో రాష్ట్రస్థాయి మహిళా రైతులు, మహిళా పారిశ్రామికవేత్తల సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పీవీయన్ మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఆయన సందర్శించి, వారి ఉత్పత్తులను పరిశీలించారు. మహిళలు స్వయంగా తయారు చేస్తున్న ఉత్పత్తులు, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు, స్థానిక ఉత్పత్తుల గురించి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పీవీయన్ మాధవ్ మాట్లాడుతూ, మహిళలు వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో కూడా మరింతగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. సేంద్రియ వ్యవసాయం, స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి రంగాల్లో పనిచేస్తున్న వారికి అందిస్తున్న వివిధ ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించే దిశగా అవకాశాలను అందిపుచ్చుకుని, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
మహిళా సాధికారతతో కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాలు, సమాజం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచే కార్యక్రమాలు, స్థానిక ఉత్పత్తుల మార్కెటింగ్‌కు అవసరమైన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమారస్వామి, పద్మశ్రీ వెంకటేశ్వరావు,అశోక్ కుమార్, పరశురాం రాజు, ఆదిలక్ష్మి ,లక్ష్మిసుజాత,జ్యోతి , విరజశ్రీ,ఐశ్వర్య,డా. కృష్ణ, సాయిబాబు,మురళీ,శ్రీనివాస్ మూర్తి,రామకృష్ణ ,చంద్రరావు, వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.