'ఆదర్శ కుటుంబం.. AK47' రిలీజ్ వాయిదా.. వెంకటేష్-త్రివిక్రమ్ సినిమా కొత్త విడుదల తేదీ ఇదే!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కతున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ 'ఆదర్శ కుటుంబం.. హౌస్ నెం. 47' (AK47). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని మొదట దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేశారు. అయితే, తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మారుస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
తొలుత ప్రకటించిన తేదీ కంటే ఒక వారం ఆలస్యంగా, ఈ చిత్రాన్ని అక్టోబర్ 9, 2026న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కాస్త అదనపు సమయం పడుతుండటంతో పాటు, ప్రేక్షకులకు అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో కూడిన సంపూర్ణ వినోదాన్ని అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్, నివేతా పేతురాజ్, డింపుల్ హయతి, సత్య, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు, వెంకటేష్ కుటుంబ కథానాయకుడిగా యాక్షన్, కామెడీ మేళవింపుతో రాబోతుండటంతో అక్టోబర్ 9న రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.