గణేష్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ: మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్: నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న నేపథ్యంలో, ఉత్సవాల 9వ రోజు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్) పలు గణేష్ మండపాలను సందర్శించారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శ్రీ గణనాథుల విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
మండపాల నిర్వాహకులు, భక్తులతో ఎమ్మెల్యే మాట్లాడి ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి, శాంతి, సోదరభావంతో కొనసాగాలని, ప్రజలందరికీ శ్రీ గణేశుడి కరుణాకటాక్షాలు లభించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.