సరికొత్త ఉడాన్ పథకానికి21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రీన్ సిగ్నల్: విస్తరించనున్న ప్రాంతీయ విమానయాన సేవలు
సూర్య జాతీయ డెస్క్: దేశంలో మారుమూల మరియు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమానయాన సేవలను మరింత చేరువ చేసేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నూతన‘ఉడాన్’(ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ప్రాంతీయ వైమానిక అనుసంధానతను బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందించిన ఈ సరికొత్త విడత పథకంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఏకంగా21 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసి పథకం అమలుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
ఈ నూతన విడత ఉడాన్ పథకం ద్వారా చిన్న నగరాలు, పర్యాటక ప్రాంతాలు మరియు ఈశాన్య, పర్వత ప్రాంతాల మధ్య విమాన రాకపోకలను భారీగా ప్రోత్సహించనున్నారు. విమానయాన సంస్థలకు ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పించడంతో పాటు టిక్కెట్ ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను పొందుపరిచింది. విమానాశ్రయాల్లో మౌలిక వసతుల కల్పన, ఇంధనంపై పన్నుల తగ్గింపు, ఎయిర్‌పోర్టు ఛార్జీల రాయితీలు మరియు అంతర్గత భద్రతా ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యక్ష భాగస్వామ్యం వహించనున్నాయి. తద్వారా నిరుపయోగంగా ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లు, హెలిప్యాడ్లు మళ్లీ వాణిజ్య రాకపోకలతో కళకళలాడనున్నాయి.
ప్రాంతీయ అనుసంధానత పెరగడం వల్ల స్థానికంగా వాణిజ్యం, పర్యాటకం, ఆరోగ్య మరియు విద్యా రంగాలు సరికొత్త పురోగతిని సాధించనున్నాయని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల ప్రజలు మెట్రో నగరాలకు వేగంగా చేరుకోవడానికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని స్పష్టం చేశారు. మిగిలిన రాష్ట్రాలు సైతం అతి త్వరలోనే ఈ నూతన ఉడాన్ ఫ్రేమ్వర్క్లో చేరనున్నాయని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా వందలాది కొత్త వైమానిక మార్గాలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.